Tuesday, 2 July 2024

మల్లి

నేను వివక్షని మొదటిసారి గమనించినప్పుడు, నా వయసు ఒక ఆరేడేళ్ళుండొచ్చు.   

"తల్లీ..మల్లికి కొంచం ఆ పాల గిన్ని ఇవ్వు" అన్న మాట విని వంటగదిలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళాను. మల్లి గడపకి అవతల నుంచుని ఉన్నాడు. ఒక గళ్ళ చొక్కా, ఒక వదులు నిక్కరూ వేసుకుని, చేతిలో ఒక తుండు గుడ్డతో మెడ చుట్టూ చేరిన చెమటని తుడుచుకుంటూ ఉన్నాడు. అదేంటో మరి మల్లి ఎప్పుడూ అలానే కనిపించేవాడు..పరుగులు పెడుతూ, పనులు చేస్తూ, చెమట తుడుచుకుంటూ.. 

మజ్జిగ గది పక్కనే ఉన్న పాల గిన్ని తీస్కుని మల్లి వైపు నడిచాను. సరిగ్గా దాన్ని మల్లి చేతికిద్దామని చూసే లోపే "తల్లీ, చేతికందివ్వొద్దు, గడప దగ్గర పెట్టెయ్" అని వినపడి, టక్కున ఆగాను.  

నాకు అర్దంకాలేదు. మల్లికేసి చూసాను.

మల్లి ఇంకా చెమట తుడుచుకుంటూనే ఉన్నాడు, విన్నది పెద్దగా పట్టించుకున్నట్టు లేడు... నా వైపు నవ్వుతూ చూసి, గడపని చూపించి, "ఇక్కడ పెట్టండమ్మా" అన్నాడు. 

ఆరోజు మొదటిసారి నేను వివక్షని చూసాను. దాని తర్వాత చూస్తూనే ఉన్నాను. తను దాకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు, గర్వంగా ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంది. దొరికిపోయాను కదా, దాకోవడం ఎందుకు అనుకుందో ఏమో. వివక్ష తప్పు కదా, మరి తనకి అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు అప్పుడు అర్ధంకాలేదు. ఇప్పటికీ అర్ధమవట్లేదు. 

మల్లి అందరికీ మల్లి గాడు... చిన్న పెద్దా అందరికీ. తెల్లవారితే చాలు, అందరికి మల్లి కావాలి. సన్నగా ఉంటాడు మల్లి, యముకలు చెర్మాన్ని బయటకి తోస్తున్నట్టే ఉంటాయి. ఎన్ని పనులు చేస్తాడనుకున్నారు! ఇంటి పని, పాలేరు పని, పొలం పని, అన్నీ.. 

మల్లి అన్నీ చేస్తాడు...

మల్లితో అన్నీ చేయించుకుంటాం...  

తను తోడిన నీళ్ళు మేము తాగుతాం, కాని తనకి నీరు చేతికివ్వలేం. సత్తు గ్లాసులో కాని, గాజు గ్లాసులో కాని వేసి,  గడపకవతల పెట్టగలం అంతే. మల్లి పితికిన పాలు వాడతాం, కోసిన కూరలూ తింటాం, కాని మల్లిని ముట్టుకోలేం. క్షమించండి, ముట్టుకోలేము కాదు ముట్టుకోము. అది ఏదో అసమర్దత కాదు కదా...చెయ్యలేకపోవడానికి. ఆంతర్యం.    

మా చాకలి - పెద్ద బొట్టు, అంతకనా పెద్ద నవ్వు. ఎంత చక్కగా నవ్వేదో తెలుసా! ఇంటెడు బట్టలు చంకన మూట కట్టి తీసుకెళ్ళిపోయేది. వాటిని ఉతికి ఇస్త్రీ చేసి, పట్టుకొచ్చేది. ఆ తెచ్చిన బట్టలు, అలా జాగ్రత్తగా అరుగుమీదో, కుర్చీ మీదో పెట్టేది. చేతికివ్వడం నేను ఎప్పుడూ చూడలేదు, తను కూడా ఎప్పుడూ ఇచ్చుండదు. తను ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు మేము కట్టుకోవచ్చు, కాని  తనని పట్టుకోకూడదు. ఏంటో మరి!   

చాకిరీ కావాలి, మనిషి అక్కర్లేదు కాబోలు.

ఇలా వివక్ష రకరకాలుగా కనిపించడం మొదలు పెట్టింది, పల్లెలో ఉన్నా టౌనులో ఉన్నా, వివక్ష లేకుండా లేదు. కొన్ని సార్లు కనపడేది కాదు, కాని అప్పటికే నాకు అర్ధమైంది, నాకు కనపడనంత మాత్రాన అది లేనట్టు కాదు అని..  

నాకు ఒక పద్దెనిమిది ఏళ్ళ వయసున్నప్పుడు మళ్ళీ ఊరెళ్ళాను, అప్పటికి మల్లి ఇళ్ళల్లో పని మానేసాడు. సొంతంగా ఏదో చేస్కోవడం మొదలు పెట్టినట్టు ఉన్నాడు, పూర్తిగా గుర్తులేదు. ఆరోజు నేను బస్సుదిగి ఇంటికి వెళ్తుంటే, దారిలో కనిపించాడు. సైకిలు తొక్కుకుంటూ. ఫుల్ హ్యాండ్స్ చొక్కా , పాంటు వేస్కున్నాడు. ఈసారి మల్లికి బుగ్గలొచ్చాయ్. కొంచం గుండ్రంగా ఉన్నాడు.  

"మల్లీ..." అని పిలిచాను. వెనక్కి తిరిగి చూసాడు.

కొంచం సేపు నన్ను పోల్చుకున్నట్టులేడు. అప్పటికి ఒక మూడు నాలుగు సంవస్తరాలు అయ్యుంటదేమో మల్లి నన్ను ఆఖరుగా చూసి. 

ఒక రెండు నిముషాలు ఆలానే చూసి, పెదవుల నిండా నవ్వు నింపుకుని, "అమ్మా మీరా!" అన్నాడు. 

"ఎలా ఉన్నావు మల్లి," అనడిగాను, తలూపుతూ. 

"బాగున్నానమ్మా.. మీరు," అన్నాడు, కళ్ళనిండా నీళ్ళతో. మా మల్లి చాలా మంచోడు. ఎంత ప్రేమగా మాట్లాడతాడో. 

ఇంకొంచంసేపు అలానే మాట్లాడి, ఉంటాను అని చెప్పి తిరిగెళ్ళబోతుంటే, "ఆ పెట్టిటివ్వండమ్మా, నేను తీస్కొస్తాను" అన్నాడు, నా చేతిలో పెట్టి చూసి.

"వద్దు మల్లి, బరువే లేదు," అన్నాను. 

"ఎంత పెద్దోరైపోయారు అమ్మా..ఏసయ్య మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూస్తాడు," అన్నాడు చిన్నగా నవ్వుతూ.

నా చిన్నపటినుండి మల్లి నాతో పదే పదే చెప్పే మాట అదే. ఏసయ్య మిమ్మల్ని చల్లగా చూస్తాడు. చల్లగా చూడాలి అనడు అసలు. చల్లగా చూస్తాడు. అంతే. చూడాల్సిందే. యేసయ్యకి వేరే దారిలేదు,  మల్లి ఇవ్వడు. 

తర్వాత ఒక రెండు రోజులకి అమ్మా నాన్నా కూడ ఊరొచ్చారు. 

"మల్లి కనిపించాడే, రోడ్డు మీద అందరి ముందూ నువ్వు పిలిచి పలకరించావట కదా. నీ గురించి చెప్తూ ఉన్నాడు. నిన్నూ అన్నయ్యన్ని మెచ్చుకొవడానికి సాకు దొరకడం ఆలస్యం, ఆగడు అసలు," అంది నవ్వుతూ.  

మా మల్లిని నేనెప్పుడూ ముట్టుకోలేదు. 

మా మల్లి నన్నెప్పుడూ ఎత్తుకోలేదు. 

కేవలం పిలిచి పలకరించినందుకు మల్లి మురిసిపోయాడు. 

అప్పుడు మల్లికి ఒక నలభైయ్యేళ్ళుండవూ.. ఎన్ని పనులు  చేసుంటాడు, ఎన్ని చూసుంటాడు, ఎన్ని సహించుంటాడు. నాకు పద్దెనిమిది, ఏమి చూడలేదు, ఏమీ తెలీదు. ఐనా కాని నేను మల్లిని నువ్వు అనగలను. మల్లి మాత్రం నన్ను మీరు అనే అనగలడు. 

ఎందుకు?

వివక్ష కాదు? 

ఏళ్ళుగా మల్లి గాడు మల్లి గాడు అని వింటూ ఉన్నందుకేమో, మల్లికి నా 'నువ్వు ' లో కూడ గౌరవం కనిపించింది.. నాకు నా వివక్ష తెలిసొచ్చింది ...

2 comments:

  1. చాలా చాలా బాగుంది. మనం తరాల తరబడి మనతో సమానం హోదా పొందాల్సిన వ్యక్తులను కూడా మనకే తెలియకుండా ఎలా అవమానిస్తున్నామో చాలా బాగా చెప్పారు. ఇది మన అందిరి కథ. Thanks for writing this anu garu. - సృజన

    ReplyDelete
    Replies
    1. మనకి తెలీయకుండానే, కొన్ని అలవాట్లు చూసి నేర్చేస్కుంటాము. అవి సరైనవి కాదు అని కూడ తోచదు. Internalised privilege is difficult for one to notice.

      Delete

Hey...
Thank you for reading my words. Do let me know your thoughts.
Have a lovely day ahead.
Much Love,
Anu

p.s. visit again :)