Wednesday, 3 July 2024

ఇదెక్కడి వింత పంపకం?

తనకి అలుపు లేదు..
తనకి కోపం రాదు...
తనకి స్వార్ధం లేదు..
తనకి సహనం పోదు..
తనకి ఆశ లేదు..
తనకై తానేం కోరుకోదు...
తనకి విసుగు రాదు...
తను విశ్రాంతెపుడు తీసుకోదు...
తనకి తను అన్న భావం లేదు...
తనకి తనే ఉందో లేదో కూడ తెలీదు..

ఎవరూ అడగలేదు...
ఎపుడూ అడగలేదు...
ప్రశంసల ముసుగులో ఆంక్షలు పెడతారే తప్ప,
ప్రశ్నంటూ అడగరే!  
తను చెప్పేది వినరే! 
విరామమంటూ ఉంటే కదా, అలుపైన సలుపైన బయటపడడానికి,
సహనం అనే శాలువా కప్పి, ఓర్పనే మాలేసి, తన ఇక్కట్లు వినపడనంత గట్టిగా చప్పట్లు కొడితే ఎలా తెలిసేది? 
ఎప్పటికి తెలేసేది? 
దేనికైనా ఒక హద్దుంటుందని...! 
తన సహనంతో సహా..
 
---- 

తనకి ఏడుపు రాదు,
తనకి బెరుకు తెలీదు, 
తనకి కుటుంబం కోసం పని చెయ్యడం తప్ప,
తన భావాలని వ్యక్తీకరించడం తెలీదు,
తను ఎంత కష్టమొచ్చిన చతికిలబడి ఎరగడు.. 
తను ఎంత నష్టమొచ్చినా సహాయం కోరడు.. 
తను ధైర్యం..
తను నమ్మకం..
తను బలం..
తను బరోసా...

తనకి బరోసా కావాలో లేదో మనమెరుగం..
మనమడగం...
తన ఉనికిని ఆకాశాన్నంటిస్తాం తప్ప, 
తన ఆశల గురించి ఆరా తీయం...
నువ్వు ఇది అని చెప్పి, ఒక గిరి గీసి, అందులోకి తోసేస్తాం,
కన్నీటితో ఆ గీతని చెరిపేద్దామన్నా...
ఏడుపు రాక...వచ్చినా, ఏడవలేక...అలా ఉండాల్సిందే...
ఇలా చేస్తూ పోతే
ఎలా తెలిసేది? 
ఎప్పటికి తెలేసేది? 
దేనికైనా ఒక హద్దుంటుందని...! 
తన ధైర్యంతో సహా..  

1 comment:

Hey...
Thank you for reading my words. Do let me know your thoughts.
Have a lovely day ahead.
Much Love,
Anu

p.s. visit again :)